తాగునీటి అవసరాలు తీర్చేందుకు.. కేంద్రం సాయం చేయాలి : అసెంబ్లీలో మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం 

తాగునీటి అవసరాలు తీర్చేందుకు.. కేంద్రం సాయం చేయాలి : అసెంబ్లీలో మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం 
  • గతంలో మాదిరిగా ఉపాధి హామీలో 90 శాతం నిధులు కేంద్రమే భరించాలి
  • ఎల్​నినోను అధిగమించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు పోతున్నం
  • అసెంబ్లీలో మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్​నినో పరిస్థితులతో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్  కోరారు. వ్యవసాయ పనులు కుంటుపడుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో కూలీలకు పని కల్పించేందుకు గతంలో మాదిరిగా ఉపాధి హామీలో 90 శాతం నిధులను కేంద్రమే భరించాలని డిమాండ్​ చేశారు. ఎల్​నినోను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకుపోతుందని తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం అసెంబ్లీలో ఎల్​నినోపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రులు మాట్లాడారు. 

ఇరిగేషన్  శాఖతో సమన్వయం చేసుకుంటున్నం : మంత్రి సీతక్క

రాష్ట్రంలో తాగునీటి అవసరాలు తీర్చడానికి ఇరిగేషన్​ శాఖతో సమన్వయం చేసుకుంటూ వారానికోసారి జలాశయాల్లోని నీటి మట్టాలను పర్యవేక్షిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. రిజర్వాయర్లలో డెడ్  స్టోరేజీ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా మోటార్లను ఏర్పాటు చేయాలని ఆదేశించామని చెప్పారు. రాష్ట్రంలోని వేసవి ముగిసేంత వరకు తాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందన్నారు. 4 జిల్లాలు, 2,395 గ్రామాలు, 19 పట్టణాలకు తాగు నీరందించే సింగూరు రిజర్వాయర్​లో నీటి కొరత సమస్యగా మారిందని చెప్పారు.

12 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని.. ఈ నీళ్లు 75 రోజులకు మాత్రమే సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కోసం కృష్ణా బేసిన్‌‌లో 14, గోదావరి బేసిన్‌‌లో 20 రిజర్వాయర్ల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాగునీటి కోసం నిధులు ఇవ్వాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. 

ఆదుకుంటున్న ఉపాధి హామీ పథకం

ఎల్​నినో పరిస్థితులతో వ్యవసాయం కుంటుపడడంతో ఉపాధి హామీ పథకం ఆదుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. గత 5 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7.3 కోట్ల పని దినాలు కల్పించామని, 21 లక్షల కుటుంబాలకు, 31.5 లక్షల మంది కూలీలకు ఉపాధి లభించిందని చెప్పారు. రూ.2 వేల కోట్లకు పైగా వేతనాలు కూలీలకు చెల్లించామని తెలిపారు. వీబీ జీ రాం జీతో రాష్ట్రంపై 40 శాతం భారం పడుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో మాదిరిగా ఎల్ నినో కాలంలో  90 శాతం నిధులు కేంద్రం చెల్లించాలని డిమాండ్  చేశారు. తెలంగాణ జలసిరి కార్యక్రమం పేరుతో చేపట్టిన పనుల పోస్టర్ ను మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రదర్శించారు. ఉపాధి చట్టంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన ప్రశ్నలకు మంత్రి సీతక్క కౌంటర్  ఇచ్చారు.

గతేడాది ఉపాధి హమీ కోసం రూ.3,292 కోట్లు ఖర్చు చేయగా, కేంద్రం వాటా రూ.2,962 కోట్లు కాగా, రాష్ట వాటా 329 కోట్లని, అంతకు ముందు ఏడాది రూ.4 ,345 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో కేంద్రం వాటా రూ.3,910 కోట్లు, రాష్ట్ర వాటా 434 కోట్లు అని తెలిపారు. ఈ ఏడాది రూ.6,300 కోట్లు కేటాయిస్తే, ఇందులో కేంద్రం వాటా రూ.3,800 కోట్లు అయితే.. రాష్ట్ర వాటా రూ.2,500 కోట్లకు పెరిగిందని మంత్రి సీతక్క వివరించారు. 

17 జిల్లాల్లో త‌‌క్కువ వ‌‌ర్షపాతం : పొంగులేటి 

ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 17 జిల్లాల్లో 20 నుంచి 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. 1951 నుంచి ఇప్పటి వరకు ఎల్‌‌నినో 8 సార్లు వచ్చినప్పటికీ, ఈసారి చాలా క్లిష్ట ప‌‌రిస్ధితులు ఏర్పడ్డాయ‌‌ని చెప్పారు. కొన్ని మండ‌‌లాల్లో ఒకేసారి క్లౌడ్  బ‌‌రెస్ట్  జ‌‌రిగి ఒక‌‌ నెల‌‌లో ప‌‌డాల్సిన వ‌‌ర్షం ఒక గంట‌‌లో కురిసిందని.. ఆ నీరు ప్రజ‌‌ల‌‌కు ఉప‌‌యోగ‌‌ప‌‌డ‌‌ద‌‌ని తెలిపారు. జులై 17న జరిగిన రాష్ట్ర కేబినెట్‌‌  మీటింగ్​లో ఎల్‌‌నినో ప్రభావం, దాని వల్ల రాబోయే పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కేబినెట్‌‌  నిర్ణయాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాల ఇన్‌‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నష్ట నివారణ చర్యలు చేపట్టారని తెలిపారు. 

రైతులకు అండగా నిలవాలి : మంత్రి పొన్నం​

ఎల్​నినోను అధిగమించడానికి రాజకీయాలను పక్కన పెట్టి రైతులకు అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని తీసుకొని పోయి కేంద్రం రాష్ట్రానికి నిధులు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం కోరారు.

మూడు తడులకు నీళ్లివ్వాలి:పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం రెండు నుంచి మూడు తడులకు నీళ్లు ఇవ్వాలని​పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు. కేసీఆర్​ సర్కారు చేసిన అవినీతి వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్​ కింద పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎకరాకు నీళ్లు పారలేదన్నారు. తాగునీటి అవసరాలకు మినహాయించి మిగిలిన నీటిని విడుదల చేస్తే రైతులు నష్ట పోకుండా కాపాడవచ్చన్నారు. ఎల్​నినో వల్ల నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి తెలిపారు. 23 జిల్లాల్లో 399 మండలాల్లో కరవు ఛాయలు ఉన్నాయన్నారు.